'ప్రాజెక్ట్ కుషా'తో రక్షణ వ్యవస్థ బలోపేతం.. భారతదేశ శత్రువులకు ఇక కష్టాలు తప్పవు..!

ఇటీవల పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణ సమయంలో భారత రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది.

By Medi Samrat
Published on : 23 May 2025 4:40 PM IST

ప్రాజెక్ట్ కుషాతో రక్షణ వ్యవస్థ బలోపేతం.. భారతదేశ శత్రువులకు ఇక కష్టాలు తప్పవు..!

ఇటీవల పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణ సమయంలో భారత రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. పాకిస్తాన్ పంపిన డ్రోన్‌లు, క్షిపణులన్నింటినీ ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ దాడిని విఫలం చేసింది. పాకిస్థానీ డ్రోన్‌లను గాలిలో ధ్వంసం చేయడం ద్వారా రష్యా S-400 దాడి ప్రయత్నాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పుడు భారత్‌ తన స్వంత స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థను సిద్ధం చేసే పనిలో ఉంది.

ఆకాష్ వంటి వాయు రక్షణ వ్యవస్థలను తయారు చేసే ప్రధాన రక్షణ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రాజెక్ట్ కుషా కింద S-400 వంటి స్వదేశీ సుదూర ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది.

నివేదిక ప్రకారం.. కంపెనీ ప్రోటోటైప్‌ను 12 నుండి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.. దాని తర్వాత వినియోగదారు ట్రయల్స్ 12 నుండి 36 నెలల పాటు కొనసాగవచ్చు. ప్రాజెక్ట్ కుషాకు DRDO నాయకత్వం వహిస్తోంది. డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ మరియు క్షిపణులు వంటి వివిధ వైమానిక ముప్పులను ఎదుర్కోగల వ్యవస్థను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

డీఆర్‌డీఓతో అభివృద్ధి భాగస్వాములుగా ఉన్నామని, అనేక కుషా వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నామని బీఈఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ జైన్ తెలిపారు. ఇందులో ప్రధానంగా వివిధ రకాల రాడార్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రాజెక్ట్ కుషాతో పాటు, BEL క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (QRSAM) వ్యవస్థపై కూడా పని చేస్తోంది. భారత సైన్యం, వైమానిక దళాల‌ సంయుక్త అవసరాలను తీర్చగల ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ 30,000 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్‌లను అందుకోవచ్చని భావిస్తున్నారు.

BEL తయారు చేసిన ఆకాష్ క్షిపణి వ్యవస్థ అద్భుతమైన పనితీరుతో ఇటీవలి విజయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకాష్ అనేది భారత సాయుధ దళాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ మరియు రిపోర్టింగ్ సిస్టమ్.

Next Story