మధ్యప్రదేశ్ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ యాక్ష‌న్ ప్లాన్ రెడీ..!

Priyanka to focus on cities, Rahul on Dalits, Adivasis. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

By Medi Samrat  Published on  23 July 2023 2:07 PM GMT
మధ్యప్రదేశ్ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ యాక్ష‌న్ ప్లాన్ రెడీ..!

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నాయకత్వం వహించనున్నారు. నవంబర్-డిసెంబరులో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రియాంక గాంధీ జూన్‌లో జబల్‌పూర్ పర్యటనతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమె ఇప్పటివరకూ రాష్ట్రంలో రెండుసార్లు పర్యటించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పలు ఎన్నికల హామీలను ప్రకటించారు.

అయితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా నేతలకు బాధ్యతలు అప్పగించింది. పార్టీ వ్యూహం ప్రకారం.. ప్రియాంక గాంధీ వాద్రా పట్టణ ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ గిరిజన, దళిత, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెడ‌తార‌ని స‌మాచారం.

అధికార పీఠం ద‌క్కాలంటే ప్ర‌తి పార్టీ రాష్ట్రంలో గిరిజన, దళిత వర్గాలను కీలకంగా పరిగణిస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో 47 సీట్లు గిరిజన వర్గానికి, 35 స్థానాలు షెడ్యూల్డ్ కులాల‌కు రిజర్వ్ చేయబడ్డాయి.

ఈ రెండు తరగతులకు రిజర్వు చేయబడిన స్థానాల్లో ఏ పార్టీ గెలుపొందినా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా భావిస్తారు. కాబట్టి.. గిరిజన, దళిత తరగతులపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ రెండు తరగతులు రాష్ట్ర జనాభాలో దాదాపు 37 శాతం ఉన్నారు. దీంతో ఈ రెండు వ‌ర్గాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఉండబోతోంది. ఈ నేప‌థ్యంలోనే రెండు రాజకీయ పార్టీలు తమ వ్యూహరచన సిద్ధం చేస్తున్నాయి. 2020లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రులతో సహా 22 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్ప‌డ్డారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామాకు దారితీసిన సింధియా తిరుగుబాటు తర్వాత.. ఎన్నికలు వ‌స్తుండ‌టంతో కాంగ్రెస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది. ఈ ఎన్నిక‌ల‌లో ఎలాగైనా గెలిచి జ్యోతిరాధిత్య సింధియాకు, బీజేపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని కాంగ్రెస్ ప‌ట్టుద‌ల‌తో ఉంది.


Next Story