భారీ మెజారిటీతో గెలిపించి.. కూల్చలేని పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి

Priyanka Gandhi Claims Massive Wave Of Change. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శుక్రవారం జరిగిన జన ఆక్రోశ్ ర్యాలీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రసంగించారు

By Medi Samrat  Published on  21 July 2023 4:13 PM IST
భారీ మెజారిటీతో గెలిపించి.. కూల్చలేని పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శుక్రవారం జరిగిన జన ఆక్రోశ్ ర్యాలీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత రెండు నెలలుగా మణిపూర్ మండుతున్నదని ప్రియాంక గాంధీ అన్నారు. ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. మహిళలపై దారుణమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. 77 రోజులుగా ప్రధాని మోదీ దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

మహిళలపై జరుగుతున్న అమానవీయ ఘటనల వీడియో తెరపైకి రావడంతో ప్రధాని మోదీ బలవంతంగా ఓ వాక్యం మాట్లాడారని.. అందులోనూ రాజకీయాలు మిక్స్ చేశారని ప్రియాంక అన్నారు. రాజకీయ మర్యాదను కాపాడుకోవడం ప్రధానమంత్రి బాధ్యత అని అన్నారు. గతంలో పోరాడుతున్న ప్రతిపక్ష నేతలందరినీ దొంగలు అన్నారని మండిప‌డ్డారు. సీనియర్ నాయకులు, పార్టీల నాయకులను అవమానించారని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం, మహిళలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్లు, 100 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని అన్నారు. మన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాయన్నారు. కర్ణాటకలోనైనా, హిమాచల్‌లోనైనా, రాజస్థాన్‌లోనైనా సరే.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఈ రాష్ట్రాలన్నింటికీ పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అక్కాచెల్లెళ్ల ఖాతాల్లోకి రూ.1500 జమ చేస్తామని ప్రియాంక తెలిపారు. వికలాంగుల పింఛను పెంచుతామన్నారు. రుణమాఫీ పనులు పూర్తి చేస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లో విపరీతమైన మార్పు వస్తోందన్నారు. కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపించి, కూల్చలేని పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండని పిలుపునిచ్చారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. రాష్ట్రంలో డబ్బుతో కొన్న ప్రభుత్వమే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో దోపిడీలు, మోసాలు జరుగుతాయి. స్వాతంత్య్ర ఉద్యమం నుంచే కాంగ్రెస్‌కు పునాది పడిందన్నారు. ఈ రోజు అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం అని ప్రియాంక గాంధీ అన్నారు. అవసరమైనవన్నీ ఖరీదైనవిగా మారాయి. కిచెన్ వస్తువుల నుండి గ్యాస్ సిలిండర్ల వరకు ప్రతిదానికీ ధర పెరిగింది. ఇంత నిరుద్యోగం ఎందుకు ఉంది? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని ప్రియాంక అన్నారు. పట్వారీ పరీక్షలో స్కామ్ జరిగింది. దీనికి పరిష్కారం ఏమిటి? ఈ ప్రభుత్వం మోసాల ప్రభుత్వం అని మండిప‌డ్డారు.


Next Story