10 రోజులు.. 12 రాష్ట్రాలు.. ప్రధాని మోదీ విస్తృత దేశ పర్యటన
లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడే ముందు వచ్చే 10 రోజుల్లో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 29 కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
By అంజి Published on 4 March 2024 1:30 AM GMT10 రోజులు.. 12 రాష్ట్రాలు.. ప్రధాని మోదీ విస్తృత దేశ పర్యటన
లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడే ముందు వచ్చే 10 రోజుల్లో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 29 కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలలో ఆయన పర్యటిస్తారని అధికారులు తెలిపారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ చేరుకోనున్నారు. అక్కడ ఆయన పలు అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడతారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చెన్నై వెళ్లి.. రాత్రికి హైదరాబాద్ చేరుకుని రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రేపు ఉదయం హైదరాబాద్, సంగారెడ్డిలో పర్యటిస్తారు.
సోమవారం, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించి, అనంతరం తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న భారతీయ నాభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవిని)ని సందర్శిస్తారు. ఆదిలాబాద్‌తోపాటు చెన్నైలో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు.
మోదీ మార్చి 5న తెలంగాణలోని సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఒడిశాకు వెళ్లే ముందు ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తారు, అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే ముందు ఒడిశాలోని చండీఖోలేలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మార్చి 6న కోల్‌కతాలో అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరిస్తారని, బరాసత్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన బీహార్‌కు వెళ్లి బెట్టియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని అధికారులు తెలిపారు.
ప్రధాని మార్చి 7న జమ్మూకశ్మీర్‌లో ఉండి సాయంత్రం ఢిల్లీలో జరిగే మీడియా కార్యక్రమంలో పాల్గొంటారు. మార్చి 8న ఢిల్లీలో తొలిసారిగా జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డు కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం అస్సాంకు బయలుదేరి వెళతారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించిన మోడీ, ఆపై ఇటానగర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం అస్సాంలోని జోర్హాట్‌లో పురాణ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.
ఆ తర్వాత జోర్హాట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో పర్యటించి సిలిగురిలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మార్చి 10న మోదీ ఉత్తరప్రదేశ్‌లో ఉంటారని, అజంగఢ్‌లో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారని అధికారులు తెలిపారు. 'నమో డ్రోన్ దీదీ', 'లఖపతి దీదీ' కార్యక్రమాలకు సంబంధించి మరుసటి రోజు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ఆయన ప్రారంభిస్తారు. సాయంత్రం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) కార్యక్రమంలో పాల్గొంటారు.
మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతి, రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లను సందర్శించి, మార్చి 13న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్, అస్సాంలో మూడు ముఖ్యమైన సెమీకండక్టర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు సంబంధించిన ఔట్‌రీచ్ కార్యక్రమానికి కూడా హాజరుకానున్నట్లు వారు తెలిపారు.
ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు తన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఎజెండాపై దృష్టి సారించిన ప్రధాని వివిధ ప్రదేశాలలో లక్షల కోట్ల రూపాయలతో నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరిస్తున్నారు.