స్వాతంత్ర్యం వచ్చిప్పటి నుండి మన దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే జరుగుతున్నాయని.. అలా కాకుండా ప్రాంతీయ భాషలల్లో కూడా జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజలకు చేరువ అయ్యేలా వ్యవస్థను సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కోర్టులలో స్థానిక భాషలను ప్రోత్సహించాలని.. ఇలా చేయడం వల్ల దేశంలోని సాధారణ పౌరులకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు. శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు మన రాజ్యాంగ సౌందర్యానికి సజీవ చిత్రమని ప్రధాని మోదీ అన్నారు. 2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికల్లా దేశంలో అత్యుత్తమ న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నామని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. డిజిటల్ ఇండియా మిషన్‌లో కీలకమైన భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికత అవకాశాలను పరిగణిస్తోందని మోదీ అన్నారు. దీనికి ఈ-కోర్టుల ప్రాజెక్ట్ నేడు మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.