ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడు దేశాన్ని కలిచివేసిన నేపథ్యంలో, భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు. భూటాన్ రాజ కుటుంబంతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ ఘటనపై దృఢమైన సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ..“భూటాన్, భూటాన్ రాజ కుటుంబం మరియు ప్రపంచ శాంతిని విశ్వసించే వారందరికీ ఇది ఒక ముఖ్యమైన రోజు. భారత–భూటాన్‌ల మధ్య శతాబ్దాలుగా ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధం కారణంగా నేను ఇక్కడికి రావడం నా కర్తవ్యంగా భావించాను. కానీ నేను భారీ హృదయంతో ఇక్కడికి వచ్చాను. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయానక ఘటన మన అందరినీ కలచివేసింది.”
“నష్టపోయిన కుటుంబాల బాధ నేను అర్థం చేసుకుంటాను. ఈ క్లిష్ట సమయంలో దేశం మొత్తంగా వారి వెంట నిలబడి ఉంది. “నిన్న రాత్రంతా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో నేను నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాను. మన దర్యాప్తు సంస్థలు ఈ కుట్రను చివరివరకు వెంబడిస్తాయి. దీనికి కారణమైన ఎవ్వరైనా వారిని విడిచిపెట్టము. దేశ భద్రతపై రాజీ ఉండదు. ఈ పేలుడుకు బాధ్యులైన వారిని దోషులందరినీ తగిన శిక్ష విధిస్తాం,” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.