పీఎం గతిశక్తి ప్రణాళిక పేరుతో... కేంద్రం భారీ మాస్టర్ ప్లాన్..!

Prime minister modi launches gatishakti program. దేశంలో మౌలిక వసతుల ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరో నూతన కార్యక్రమానికి

By అంజి  Published on  13 Oct 2021 10:51 AM GMT
పీఎం గతిశక్తి ప్రణాళిక పేరుతో... కేంద్రం భారీ మాస్టర్ ప్లాన్..!

  • పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
  • రూ.100 లక్షల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి
  • మౌలిక వసతుల రంగంలో వేగం పెంచాం: ప్రధాని మోడీ

దేశంలో మౌలిక వసతుల ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విదేశీ పెట్టుబడులను ఆకర్శించడమే లక్ష్యంగా చేపట్టిన పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పనులు పూర్తి కావు అనే భావనను మార్చివేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 25 ఏళ్ల లాంగ్ టర్మ్‌ ప్లానింగ్‌తో రూ.100 లక్షల కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమంతో దేశం ముఖచిత్రం మారుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని చేపట్టారు.

నూతన మౌలిక సదుపాయాల ద్వారా దేశానికి విదేశీ పెట్టుబడులు వస్తాయన్న మోడీ.. దేశంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. గతంలో 'పనులు జరుగుతున్నాయి' అన్న బోర్డులు మాత్రమే చూశామని.. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో ప్రభుత్వ పనుల పట్ల ఉన్న అప నమ్మకపు భావను తుడిచిపెట్టిందన్నారు. గతిశక్తి కార్యక్రమం ద్వారా చేపట్టే ప్రాజెక్టులతో మౌలిక వసతుల రూపురేఖలు మారుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మౌలిక వసతుల నిర్మాణాలకు ఇచ్చే అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది.

Next Story
Share it