సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు నియమితులయ్యారు. సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు యూయూ లలిత్, ఏఎం ఖన్‌విల్కర్, డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర్‌రావులతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం 9 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తుల సిఫారసులను కేంద్రం అనుమతించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారి నియమాకం ఫైలుపై సంతకం చేసినట్లు సమాచారం.
సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులవుతున్న న్యాయమూర్తుల్లో .. సీనియర్ న్యాయమూర్తి బీవీ నాగరత్న, బేలా ఎం త్రివేది, హిమకోహ్లీ, సీటీ రవికుమార్, ఎంఎం సుందరేశ్, మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ, అభయ్ శ్రీనివాస్ ఓక, విక్రమ్‌నాథ్, జితేంద్ర కుమార్ మహేశ్వరి కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో బీవీ నాగరత్న 2027 సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ బీవీ నాగరత్న చరిత్రలో నిలిచిపోనున్నారు.