నేడు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్ర‌ప‌తి

రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ఈరోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు, ఇది మూడ‌వ‌సారి NDA ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అధ్యక్ష ప్రసంగం కావ‌డం విశేషం.

By Medi Samrat  Published on  27 Jun 2024 2:38 AM GMT
నేడు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్ర‌ప‌తి

రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ఈరోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు, ఇది మూడ‌వ‌సారి NDA ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అధ్యక్ష ప్రసంగం కావ‌డం విశేషం. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టబ‌డుతుంది. దానిపై సభ్యులు చర్చిస్తారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

అంతకుముందు బుధవారం ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండవసారి ఎన్నికయ్యారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బలపరచడం.. మూజువాణి ఓటు ద్వారా సభ ఆ తీర్మానాన్ని ఆమోదించడం జ‌రిగింది.

స్పీక‌ర్‌గా ఎన్నికైన ఓం బిర్లా మాట్లాడుతూ,. 18వ లోక్‌సభకు కొత్త దృక్పథం, సంకల్పం ఉండాలని కోరారు. 18వ లోక్‌సభ సృజనాత్మక ఆలోచనలకు, కొత్త ఆలోచనలకు కేంద్రంగా ఉండాలని, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను, గౌరవాన్ని ఉన్నత స్థాయిలో నెలకొల్పేలా ఉండాలని, వికసిత్‌ భారత్ సంకల్పాన్ని నెరవేర్చడమే సభ లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

దిగువ సభ స్పీకర్‌గా తిరిగి ఎన్నికైనందుకు బిర్లాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అమృత్‌కాల్ సందర్భంగా రెండోసారి ఈ పదవిలో కూర్చోవడం చాలా పెద్ద బాధ్యత అని అన్నారు. ఓం బిర్లా అధ్యక్షతన 17వ లోక్‌సభలో తీసుకున్న నిర్ణయం పార్లమెంటరీ చరిత్రలో స్వర్ణకాలంగా పరిగణించబడుతుందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. ఓం బిర్లా తిరిగి స్పీక‌ర్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ప్రజల స్వరానికి తుది మధ్యవర్తి అని, ఈసారి ప్రతిపక్షం 17వ లోక్ సభ కంటే ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు.

Next Story