రైలులో సొంత ఊరికి వెళ్లిన రాష్ట్రపతి దంపతులు

President Kovind, wife board special train from Delhi to his native place Kanpur. భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తన భార్య సవితాదేవితో

By Medi Samrat  Published on  25 Jun 2021 3:48 PM IST
రైలులో సొంత ఊరికి వెళ్లిన రాష్ట్రపతి దంపతులు

భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తన భార్య సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్‌లోని స్వస్థలానికి రైలులో బయలుదేరారు. ఢిల్లీ సప్ధర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలును ఎక్కారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరగా.. సాయంత్రానికి కాన్పూర్‌ చేరుకుంటుంది. రాంనాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటిసారిగా స్వగ్రామానికి రైలులో వెళ్తున్నారు. 15 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి రైలు ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో ప్రయాణించారు.

రాంనాథ్‌ కోవింద్‌ దంపతులను ట్రైన్ ఎక్కించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వేబోర్డు చైర్మన్‌, సీఈఓ సునీశ్‌ శర్మ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేశారు. కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురాల వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. పర్యటనలో రాష్ట్రపతి పాత పరిచయస్తులను, పాఠశాల స్నేహితులను కలువనున్నారు. గ్రామాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఈ నెల 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో లక్నోకు చేరుకుంటారు. అక్కడ పర్యటన అనంతరం తిరిగి 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి రానున్నారు.


Next Story