పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం హైలెట్స్..
President Kovind hails schemes, fight against pandemic. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
By Medi Samrat Published on 31 Jan 2022 3:05 PM ISTరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తూ.. ప్రభుత్వ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా భారతదేశం మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో భారత్ 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచ పెట్టుబడిదారులకు భారతదేశ అభివృద్ధిపై భరోసా ఉందని ఆయన అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాల గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ.. కోవిడ్-19 టీకా కార్యక్రమం మహమ్మారిపై పోరాటంలో భారతదేశ సామర్థ్యాలను రుజువు చేసిందని అన్నారు. ఏడాదిలోపే 150 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించిన మైలురాయిని దేశం అధిగమించిందని ఆయన అన్నారు. దేశంలో 90 శాతం కంటే ఎక్కువ మంది వయోజన పౌరులు మొదటి డోస్ వ్యాక్సిన్‌ను పొందారని.. 70 శాతానికి పైగా రెండు డోస్‌లను పొందారని ఆయన చెప్పారు. యావత్ ప్రపంచాన్ని మహమ్మారి నుంచి విముక్తం చేయడంలో.. కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడడంలో స్వదేశీ వ్యాక్సిన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ఆరోగ్య మరియు ఫ్రంట్‌లైన్ కార్మికుల సహకారాన్ని ఆయన ప్రశంసించారు.
ప్రభుత్వ అంత్యోదయ మంత్రాన్ని పునరుద్ఘాటిస్తూ.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలందరికీ ప్రభుత్వం ప్రతినెలా ఉచిత రేషన్ ఇస్తోందని అన్నారు. జన్‌ధన్-ఆధార్-మొబైల్ (జామ్) త్రిమూర్తులు పౌరులను శక్తివంతం చేశాయన్నారు. 44 కోట్ల మందికి పైగా పేదలు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడం వల్ల.. మహమ్మారి సమయంలో కోట్లాది మంది లబ్ధిదారులు ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనం పొందారని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన విజయవంతం అవడంపై రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ పథకం కింద పేదలకు రెండు కోట్లకు పైగా పక్కా గృహాలు అందించామన్నారు. జల్ జీవన్ మిషన్ ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావడం ప్రారంభించిందని ఆయన అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరియు దేశంలోని రైతులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణలో రికార్డు సృష్టించిందని అన్నారు.
ప్రభుత్వ కృషి వల్ల దేశంలో వ్యవసాయ ఎగుమతులు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయన్నారు. 2020-21 సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 25 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయని ఆయన చెప్పారు. పీఎం-కిసాన్ పథకం కింద 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.1.80 లక్షల కోట్లు అందాయని ఆయన చెప్పారు. ఈ పెట్టుబడితో నేడు వ్యవసాయ రంగంలో పెను మార్పులు కనిపిస్తున్నాయన్నారు. లింగ సమానత్వం కోసం ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచిందని తెలిపారు. భారత స్టార్టప్ విజయగాథను రాష్ట్రపతి ప్రశంసిస్తూ.. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థ ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని అన్నారు.