రాహుల్ గాంధీపై మరోసారి విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్
Prashant Kishor Fires On Rahul Gandhi. ప్రముఖ ఎన్నికల ప్రచారకర్త ప్రశాంత్ కిశోర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జట్టు కడతారని
By Medi Samrat Published on 2 Dec 2021 5:15 PM ISTప్రముఖ ఎన్నికల ప్రచారకర్త ప్రశాంత్ కిశోర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జట్టు కడతారని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని స్పష్టంగా కొద్దిరోజులకే తేలింది. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కూడా సంచలన ట్వీట్ చేశారు ప్రశాంత్ కిశోర్. గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓటమి పాలైందని, ఇక ఆ పార్టీ నాయకత్వం ఓ వ్యక్తికే చెందిన దైవ హక్కుగా భావిస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.
ప్రతిపక్షం ఎప్పుడూ బలంగా ఉండాలని.. ఇక విపక్ష సారధిని ప్రజాస్వామ్య రీతిలో ఎన్నుకోవాలని ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. ఇది రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన ట్వీట్ అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. అక్టోబరు నెలలో కూడా ప్రశాంత్ కిషోర్ గోవాలో మాట్లాడుతూ బీజేపీ రాబోయే దశాబ్దాల కాలంలో ఎక్కడికీ వెళ్ళడం లేదని రాహుల్ గాంధీ గుర్తించలేకపోతున్నారని అన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా యూపీఏపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ దేశంలో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అంటే ఏమిటి? అలాంటిదేమీ లేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశంలో యూపీఏ లేదని.. ప్రస్తుత నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీనైనా ముందుకొస్తే.. స్వాగతిస్తామన్నారు. అది కాంగ్రెస్ పార్టీకీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.