రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ తిరస్కరించిన విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. నిర్దిష్టమైన బాధ్యతలతో పార్టీలో చేరాలని స్వయంగా సోనియా ప్రతిపాదించగా దాన్ని ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారు. ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదని స్పష్టం చేశారు. ఆ పార్టీకి సలహాదారుగా మాత్రమే వ్యవహరిస్తానని వెల్లడించారు. పార్టీలోకి రావాలన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆహ్వానాన్ని ఆమోదించలేకపోతున్నానని తెలిపారు. తాను పార్టీలో ఉండడం కంటే సలహాదారుగా ఉండడమే అవసరమని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి పునర్ నిర్మాణం జరగాల్సి ఉందని తెలిపారు. పార్టీ పునర్ నిర్మాణంలో కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు.