ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేరాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ అగ్రనేతల సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్ వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేరాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. "ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరవచ్చు. ఆయనను సలహాదారుగా ఉపయోగించరు, బదులుగా పార్టీలో చేరి నాయకుడిగా పని చేయమని అడిగారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అవసరమైన రోడ్‌మ్యాప్, సంస్థాగత మార్పుల గురించి ఆయన ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చాడు" అని కొన్ని లీక్స్ వచ్చాయి.
కాంగ్రెస్ ఇప్పటికే బలంగా ఉన్న రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రశాంత్ పేర్కొన్నారని తెలుస్తోంది. "సంస్థాగత నిర్మాణం, ముఖ్యంగా కమ్యూనికేషన్ విభాగంలో పూర్తి సమగ్ర మార్పు అవసరమని ప్రశాంత్ చెప్పారు. కమ్యూనికేషన్ వ్యూహాన్ని పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది," అని మూలాలు తెలిపాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ, "2024 ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్ ఇచ్చారని, దానిని పార్టీ నేతలు చూస్తారని, ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్న వారు నిర్ణయిస్తారని" అన్నారు. 370 లోక్‌సభ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని, మిగిలిన స్థానాల్లో పొత్తులు పెట్టుకోవాలని ప్రశాంత్ చెప్పినట్లు పార్టీ అగ్రవర్గాల సమాచారం.
ప్రెజెంటేషన్‌పై నేతల బృందం చర్చిస్తుందని రాహుల్ గాంధీ కూడా సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్‌లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై కూడా ప్రశాంత్ కిషోర్ చర్చించారు.