ఇంత పాత పార్టీలో ఇలాంటి సంప్రదాయాలేంటి.? : కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రణబ్ కూతురు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 29 Dec 2024 6:28 PM ISTమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితిలో ఉందని, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులు, అగ్రనేతల్లో భావజాలం లేకపోవడం వల్ల నేడు చాలా మంది పాత కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి దరంగా ఉన్నారని శర్మిష్ట ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. తన తండ్రి మరణానంతరం సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని, ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు.
తన తండ్రి మరణానంతరం సీడబ్ల్యుసీ సమావేశమవకపోవడంతో తాను బాధపడ్డానని ఆమె అన్నారు. CWC అనేది కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ.. దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నేను వాస్తవాలను మాట్లాడుతున్నాను.. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అజాగ్రత్త వల్ల జరిగిందో నాకు తెలియదని.. ఇంత పాత పార్టీలో ఇలాంటి సంప్రదాయాలేంటి? అని ప్రశ్నించారు.
వార్తా సంస్థ పిటిఐతో ముఖర్జీ మాట్లాడుతూ.. 'సంస్థాగతంగా జ్ఞాపకశక్తి కోల్పోయి ఉంటే.. రాహుల్ గాంధీ, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులకు గత పరిస్థితులలో కాంగ్రెస్ ఎలా పనిచేసిందో తెలియకపోతే.. కాంగ్రెస్‌లో తీవ్రమైన, విచారకరమైన పరిస్థితి ఉంది అని వ్యాఖ్యానించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఏం చేశారో మనం మర్చిపోకూడదు. మొత్తం కాంగ్రెస్ యంత్రాంగం, దాని సోషల్ మీడియా నన్ను, మా నాన్నను ఈ విషయమై, కొన్ని ఇతర సమస్యలపై నిరంతరం ట్రోల్ చేస్తోంది. నాలాంటి పెద్ద నాయకులపైనా, మా నాన్నపైనా మాట్లాడిన తీరు.. పార్టీ కుళ్లిపోయిందని తెలియజేస్తోందన్నారు. 'సోషల్ మీడియాలో ట్రోల్ చేసే బదులు.. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మిన నాలాంటి వ్యక్తులు ఈ రోజు ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి' అని అన్నారు.