2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలయ్యారు మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్. కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్ర నాయకుల పేర్లు చెప్పాలని తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు. అప్పటి దర్యాప్తు అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ నేతలు రామ్ మాధవ్, ఇంద్రేష్ కుమార్ వంటి వారి పేర్లు చెప్పమని బలవంతం చేశారని, వారి పేర్లు చెబితే చిత్రహింసలు ఆపేస్తామన్నారన్నారు. ఈ కేసు పూర్తిగా కల్పితమని, నిరాధారమైనదని ఆమె కొట్టిపారేశారు. తనను 24 రోజుల పాటు కస్టడీలో ఉంచి దారుణంగా హింసించారని, ఈ దారుణాలకు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంవీర్ సింగ్ కారణమని ఆరోపించారు.
తనపై జరిగిన ఈ అన్యాయంపై పుస్తకం రాస్తున్నానని, అందులో అన్ని నిజాలు బయటపెడతానని ప్రజ్ఞా సింగ్ తెలిపారు. ఈ కేసులో హేమంత్ కర్కరే, సుఖ్వీందర్ సింగ్, ఖాన్విల్కర్ వంటి అధికారులు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు.