మోదీ ప్రవేశపెట్టిన పెన్ష‌న్‌ పథకం ద్వారా నెలకు రూ.3000 పొందండి.. ఎలాగంటే..!

Pradhan Mantri Shram Yogi Mandhan. నిరుపేదలు, వృద్దులకు మేలు జరిగే విధంగా, వారికి ఆర్థికంగా సాయం అందించేలా కేంద్ర సర్కార్‌

By Medi Samrat  Published on  13 March 2021 8:05 AM GMT
మోదీ ప్రవేశపెట్టిన పెన్ష‌న్‌ పథకం ద్వారా నెలకు రూ.3000 పొందండి.. ఎలాగంటే..!
నిరుపేదలు, వృద్దులకు మేలు జరిగే విధంగా, వారికి ఆర్థికంగా సాయం అందించేలా కేంద్ర సర్కార్‌ వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతూ ఆసరాగా నిలుస్తోంది. పథకాల్లో భాగంగా ప్రధాన్‌మంత్రి శ్రమ్‌ యోగి మాన్‌ ధన్‌ (పీఎం-ఎస్‌వైఎం). ఈ స్కీమ్‌ ద్వారా కేంద్రం పేదలు, వృద్ధులకు నెలకు రూ.3000 చొప్పున సాయం అందించనుంది. ఇప్పటికే ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.


పేద, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019లో ప్రారంభించింది. అయితే ఈ పథకం కింద అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీసం రూ.3000 పెన్షన్‌ ఇవ్వనుంది. అసంఘటిత రంగంలో పని చేసే వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్‌ కింద 2021 మార్చి 4 నాటికి సుమారు 44.90 లక్షల మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 18-40 ఏళ్ల వయసు ఉన్న కార్మికులు ఈ పథకానికి అర్హులు. అయితే వారి నెలసరి ఆదాయం రూ.15000కన్నా తక్కువ ఉండాలి.

పెన్షన్ పొందడం ఎలా...?

'ప్రధాన మంత్రి శ్రమ్‌ యోగి మన్‌-ధన్‌ యోజన '(పీఎం-ఎస్‌వైఎం) పథకం కింద నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు జమ చేయవచ్చు. ఇందులో 18 ఏళ్లు నిండిన వారు నెలకు రూ.55, 30 ఏళ్లు నిండిన వారు నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 40 ఏళ్లు నిండిన వారు నెలకు రూ.200 చెల్లించాలి.

అయితే ఉదాహారణకు చెప్పాలంటే.. ఓ కార్మికులు 18 సంవత్సరాల వయసులో పీఎం-ఎస్‌వైఎం ( PM-SYM) స్కీమ్‌లో తన పేరును నమోదు చేసుకుంటే అతను ఏడాదికి రూ.660 జమ చేయాల్సి ఉంటుంది. అంటే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3వేల చొప్పున పెన్షన్‌ అందిస్తారు. ఒక వేళ లబ్దిదారు చనిపోయినట్లయితే భాగస్వామిగా ఉన్న వ్యక్తికి 50 శాతం పెన్షన్‌ అందిస్తారు. ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (LIC) ద్వారా నిర్వహిస్తోంది.

పేరు నమోదు చేసుకోవడం ఎలా..?

ఈ పథకంలో రిజిస్ట్రేషన్‌ కోసం కామన్‌ సర్వీస్‌ సెంటర్ (సీఎస్సీ సెంటర్‌)ను సంప్రదించాలి. వారి వెంట ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌ పాస్‌ బుక్‌ను తీసుకెళ్లాలి. ఇక పీఎంఎస్‌వైస్‌ఎం కింద ఖాతా తెరిచిన తర్వాత కార్మికుడికి శ్రమ్‌ యోగి కార్డు ఇస్తారు. కాగా, ఈ పథకం గురించి మరింత సమాచారం కొరకు హెల్ప్‌లైన్ నంబర్ 1800-267-6888ను సంప్రదించవచ్చు.




Next Story