పక్క రాష్ట్రం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితం (ఉదయం 7 గంటలకు) ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. గత 40 రోజులుగా హోరాహోరీగా ప్రచారం సాగింది. సోమవారం నాటికి ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎలక్షన్స్‌లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర పార్టీల భవిత్యం మరో నాలుగు రోజుల్లో తేలనుంది. అన్ని పార్టీల అభ్యర్థులు, 918 మంది స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 2,165 మంది బరిలో ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 72.36 శాతం ఓటింగ్ నమోదవగా.. ఈ సారి అంతకుమించి ఓటింగ్ నమోదు కోసం ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా 5.31 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు కొనసాగుతోంది. ఇక షిగ్గాన్ స్థానం నుంచి సీఎం బసవరాజ్ బొమ్మై, వరుణ నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్య, చెన్నపట్నం నుంచి కుమారస్వామి, కనకపుర నుంచి డీకే శివకుమార్ పోటీ చేస్తున్నారు. కర్ణాటక ప్రజలు తమ తమ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటు వేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ నటుడు ప్రకాష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.