ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
By Medi Samrat Published on 5 Feb 2025 6:25 PM ISTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. భారత ఎన్నికల సంఘం ప్రకారం, సాయంత్రం 6 గంటలకు అధికారికంగా పోలింగ్ ముగిసిన తర్వాత క్యూలో నిలబడిన ఓటర్లందరూ మాత్రమే ఓటు వేయడానికి అనుమతించబడతారు. ఢిల్లీలో సాయంత్రం 6 గంటలకల్లా ఓటింగ్ 63% నుంచి 65% వరకూ నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 62 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు పశ్చిమ, నైరుతి జిల్లాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఇందులో నజఫ్‌గఢ్ మొదటి స్థానంలో, పాలెం రెండో స్థానంలో నిలిచాయి. పాలెంలో 60.05 శాతం ఓటింగ్ నమోదైంది. నజాఫ్‌గఢ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 61.48 శాతం ఓటింగ్ నమోదైంది
పలు అసెంబ్లీ స్థానాల్లో నమోదైన పోలింగ్ శాతం..
రిథాలా అసెంబ్లీ: 55.57 శాతం
ముండ్కా: 57.53 శాతం
కిరారీ: 60.19 శాతం
సుల్తాన్‌పూర్ మజ్రా: 57.35 శాతం
మంగోల్‌పురి ఎస్సీ: 61.48 శాతం
షాలిమార్ బాగ్: 55.24 శాతం
త్రినగర్: 59.68 శాతం
ఇదిలావుంటే.. సీలంపూర్‌లో ముస్లిం మహిళలు బురఖా ధరించి నకిలీ ఓట్లు వేస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆరోపిస్తోంది. ముస్లిం మహిళలు నకిలీ ఓట్లు వేస్తున్నారని బీజేపీ అభ్యర్థి అనిల్ గౌర్ ఆరోపించారు.
రాజధాని ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఢిల్లీ విధానసభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేడు రాజధాని ఢిల్లీలోని ప్రతి మూల మూలలో కఠినమైన పోలీసు నిఘా ఉంది. అన్ని అనుమానాస్పద కార్యకలాపాలను నిశితంగా పరిశీలించారు.