ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన (PMSGMBY) కింద కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి మొత్తం కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించాలని భావిస్తోంది.
2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇళ్లలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు. దీనికోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ. 2 లక్షల వరకు లోన్ అందిస్తాయి. ఇందులో రూ. 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. ఏడాదికి 6.75 శాతం వడ్డీ రేటుతో.. రూ. 6 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే రూ. 2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం వరకు బ్యాంక్ ఫైనాన్సింగ్ సదుపాయం ఉంటుంది.