ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్ కోటి మంది సబ్‌స్క్రైబర్‌ల మార్క్ ను దాటింది. గూగుల్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఆయనను ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరిగా మార్చారు. 2007 అక్టోబరులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'నరేంద్రమోదీ' ఛానల్ సృష్టించబడింది. ఛానెల్‌లో పలు విషయాలకు సంబంధించి మోదీ వీడియోలను అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఛానెల్‌తో పాటు, యూట్యూబ్‌లో ప్రధానికి అధికారిక PMO ఇండియా ఛానెల్ కూడా ఉంది. దీని ద్వారా దేశానికి అధికారిక ప్రకటనలు, PM ప్రసంగాలు అప్లోడ్ చేస్తుంటారు. ప్రధాని మోదీకి ట్విట్టర్ లో 753 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్ లో 468 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
భారత్ కు చెందిన నేతల్లో రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది, శశి థరూర్ కు 4.39 లక్షల మంది, అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షల మంది, ఎంకే స్టాలిన్ కు 2.12 లక్షల మంది, మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది చొప్పున సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఛానల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 7.03 లక్షలుగా ఉంది. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ కు చందాదారులు 19 లక్షల మంది ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు 28.8 లక్షల మంది చందాదారులు ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడర్ కు 30.7 లక్షల మంది, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కు 36 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.