టెలికాం రంగంలో కొత్త శకం.. 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Narendra Modi Launches 5G Services In India.భారత దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. శనివారం దేశంలో
By తోట వంశీ కుమార్ Published on 1 Oct 2022 11:43 AM ISTభారత దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. శనివారం దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్-2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. అనంతరం 5జీ సేవలకు సంబంధించిన ప్రదర్శనను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఈ సేవల సామర్థ్యానికి సంబంధించిన డెమోను రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రధానికి వివరించారు. ఆ తరువాత 5జీ సేవల తీరును మోదీ స్వయంగా పరిశీలించారు.
మొదటగా 13 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభంకానున్నాయి. క్రమంగా దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఇందుకు రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. తొలి దశలో బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, చంఢీగర్, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, గాంధీనగర్, జామ్‌నగర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, పుణె నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Prime Minister Narendra Modi launches the #5GServices in the country, at Indian Mobile Congress (IMC) 2022 in Delhi. pic.twitter.com/uJo2ovkrcr
— ANI (@ANI) October 1, 2022
ప్రస్తుత 4జీతో పోలిస్తే 7 నుంచి 10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభించనుంది. 5జీ సేవల కోసం జియోరూ.88,078కోట్లు, ఎయిర్‌టెల్ రూ.43,084, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్లు వెచ్చించి స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో 5 జీ సేవలను తీసుకువస్తామని జియో ఇప్పటికే ప్రకటించగా.. నెలరోజుల్లోనే 5జీ సేవలను ప్రారంభిస్తామని ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విఠల్ కూడా చెప్పారు.