కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, మోదీ గేట్ నంబర్ 1
By అంజి Published on 28 May 2023 4:06 AM GMTకొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, మోదీ గేట్ నంబర్ 1 నుంచి పార్లమెంట్ ఆవరణలోకి వెళ్లగా.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్న మోదీ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి నూతన భవన ప్రారంభోత్సవ పూజలో పాల్గొన్నారు. కర్ణాటకలోని శృంగేరి మఠం నుండి అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య, కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ఆశీర్వదించడానికి ప్రధానమంత్రి దేవుళ్ళను ఆరాధించడానికి "గణపతి హోమం" నిర్వహించారు.
ప్రధానమంత్రి "సెంగోల్" ముందు సాష్టాంగం చేసి, చేతిలో పవిత్ర రాజదండంతో తమిళనాడులోని వివిధ అధీనాల ప్రధాన పూజారుల నుండి ఆశీర్వాదం కోరారు. మోడీ "నాదస్వరం" రాగాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య "సెంగోల్" ను ఊరేగింపుగా కొత్త పార్లమెంటు భవనానికి తీసుకువెళ్లారు. లోక్‌సభ ఛాంబర్‌లోని స్పీకర్ కుర్చీకి కుడి వైపున ఉన్న ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో దాన్ని ప్రతిష్టించారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, జితేంద్ర సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో కీలక పాత్రలు పోషించిన కొంతమంది కార్మికులను ప్రధాని సత్కరించారు. మరో వైపు నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్‌తో సహా 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.