ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం రెండో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించే ప్రయత్నాలను సమన్వయం చేయడానికి నలుగురు కేంద్ర మంత్రులను అక్కడికి పంపాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం మొదటి సమావేశం నిర్వహించారు. రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న వేళ భారతీయుల భద్రత, తరలింపు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన విషయమని ఆయన నొక్కిచెప్పారు.
కేంద్ర మంత్రులు హర్దీప్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, వికె సింగ్ భారత్ యొక్క ప్రత్యేక దూతలుగా అక్కడికి వెళతారని ప్రభుత్వ వర్గాలు ముందుగా తెలిపాయి. రిజిజు స్లోవేకియాకు వెళ్లనుండగా.. రొమేనియా, మోల్డోవా నుండి తరలింపు ప్రయత్నాలను జ్యోతిరాదిత్య సింధియా చూసుకుంటారు. భూ సరిహద్దుల ద్వారా ఉక్రెయిన్ నుండి వచ్చిన భారతీయుల తరలింపును చూసుకోవడానికి వీకే సింగ్ పోలాండ్ వెళ్లనుండగా.. మరో కేంద్రమంత్రి హర్దీప్ పూరీ హంగేరీకి నుండి సమన్వయం చేయనున్నారు.