రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యన్ భాషలో భగవద్గీత ప్రతిని బహూకరించారు. దీనికి సంబంధించిన ఫొటోను ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్‌లో పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ గ్రంథం ప్రేరణాత్మక మూలంగా ఉందని అభివర్ణించారు. "రష్యన్ భాషలో గీత ప్రతిని అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించాను. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయి" అని ప్రధాని మోదీ అన్నారు.
కాగా గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడిని ప్రధాని మోదీ హృదయపూర్వకంగా స్వాగతించిన తర్వాత ఇది జరిగింది. ఇద్దరు నాయకులు విమానాశ్రయం నుండి ప్రధానమంత్రి లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసం వరకు కారు ప్రయాణం చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన పుతిన్ ఇవాళ సాయంత్రం వరకు ఢిల్లీలో ఉంటారు. తన పర్యటన సందర్భంగా, రష్యా అధ్యక్షుడు ప్రధాని మోదీతో కలిసి 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు.