ఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతజయంతి ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి స్మారకంగా ప్రత్యేకంగా రూపొందించిన తపాలా స్టాంపు మరియు స్మారక నాణెం విడుదల చేసి సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
1925లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో డాక్టర్ కేశవ్ బాలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్‌ను స్థాపించారు. దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావం, సాంస్కృతిక విలువలతో జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా ఈ సంస్థ రూపుదిద్దుకుంది.విద్య, ఆరోగ్యం, సమాజ సేవ, విపత్తు సహాయక చర్యలతో పాటు యువత, మహిళలు, రైతుల అభ్యున్నతికి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. వరదలు, భూకంపాలు, తుపాన్లు వంటి విపత్తుల్లో స్వయంసేవకులు ముందుండి సహాయక చర్యలు చేపట్టారు. శతజయంతి వేడుకలు ఆర్ఎస్ఎస్ చరిత్రాత్మక ప్రయాణాన్ని స్మరించడమే కాకుండా, భారతీయ సంస్కృతిలో దాని విశిష్ట కృషిని, జాతీయ ఐక్యత సందేశాన్ని వెలుగులోకి తెస్తాయి.