ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు వెల్లడించాయి. సమావేశంలో 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతూ ఉండగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఈ మీటింగ్ కు దూరంగానే ఉన్నారు. బీజీపీయేతర సీఎంలలో ఆంధ్రప్రదేశ్, ఒడిసా సీఎంలు మాత్రమే హాజరవుతున్నారు.
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంతో పాటు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలే కాకుండా యూపీఏ భాగస్వామ్య పార్టీల సీఎంలు కూడా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నాయి.