ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ రాజధానిలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ రెండు కొత్త ఢిల్లీ మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు లైన్లకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.33,500 కోట్ల మొత్తం వ్యయంతో కూడిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (GPRA) పునరాభివృద్ధి ప్రణాళిక కింద రూ.15,200 కోట్ల విలువైన పనులను కూడా ప్రధాని ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన 12.3 కి.మీల మజ్లిస్ పార్క్-మౌజ్‌పూర్ బాబర్‌పూర్ (పింక్ లైన్), 9.9 కి.మీల దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ (మెజెంటా లైన్) కారిడార్ల వల్ల బురారీ, వజీరాబాద్, భజన్‌పురా, మజ్లిస్ పార్క్ వంటి పలు ప్రాంతాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కలగనుంది.
అంతేకాకుండా, ఢిల్లీ మెట్రో ఫేజ్ VA కింద సుమారు 16.1 కి.మీ మేర విస్తరించే మూడు కొత్త కారిడార్లకు మోడీ శంకుస్థాపన చేశారు. ఆర్‌కె ఆశ్రమ మార్గ్ నుండి ఇంద్రప్రస్థ, ఏరోసిటీ నుండి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1 మరియు తుగ్లకాబాద్ నుండి కాళింది కుంజ్ వరకు ఈ కొత్త లైన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల దక్షిణ ఢిల్లీ, నోయిడా మరియు విమానాశ్రయం మధ్య ప్రయాణించే వారికి ప్రత్యక్ష కనెక్టివిటీ లభించడమే కాకుండా, రాజధానిలో ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి.