కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు.
By అంజి Published on 28 May 2023 7:47 AM ISTకొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించే ముందు వేదాల ప్రకారం వివిధ ఆచారాలు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నాయకత్వం వహించనున్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు బహిరంగపరచనప్పటికీ, ప్రారంభోత్సవం రెండు దశల్లో జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
అయితే ఈవెంట్ కోసం ఉదయం నుండి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం 7:15 గంటల నుంచి అంగరంగ వైభవంగా వేడుక ప్రారంభమైందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నుండి పూజతో సహా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత పీఎం మోడీ సెంగోల్‌ను స్వీకరిస్తారు. వేడుక తర్వాత సెంగోల్‌ను ప్రతిష్టిస్తారు. అనంతరం ఫలకాన్ని ఆవిష్కరించి దీపాన్ని వెలిగిస్తారు. ఇంకా, పీఎం మోదీ శ్రమజీవిలతో సంభాషిస్తారు. సర్వ్ ధర్మ సభ నిర్వహించబడుతుంది. పార్లమెంట్ నిర్మాణంలో పనిచేసిన కార్మికులను ప్రధాని మోదీ సత్కరిస్తారు. ఉదయం 9 గంటల వరకు వైదిక ఆచార పద్ధతిలో పూజతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రారంభ వేడుకలకు ముందు ఆచారాలు ఉదయం ప్రారంభమవుతాయని, పార్లమెంటులోని గాంధీ విగ్రహం సమీపంలోని పండల్ (పందిరి)లో నిర్వహించే అవకాశం ఉందని ఆ వర్గాలు ఏఎన్‌ఐకి తెలిపాయి.
ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్, ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ప్రభుత్వంలోని కొందరు సీనియర్ మంత్రులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. పూజల అనంతరం నూతన భవనంలోని లోక్ సభ ఛాంబర్, రాజ్యసభ ఛాంబర్ ప్రాంగణాన్ని ఉన్నతాధికారులు పరిశీలించనున్నారని సమాచారం. లోక్‌సభ ఛాంబర్‌లో స్పీకర్ కుర్చీకి పక్కనే కొన్ని పూజలు చేసిన తర్వాత పవిత్రమైన 'సెంగోల్'ని ప్రతిష్టించే అవకాశం ఉంది. దీనికి రూపకల్పన చేసిన అసలు నగల వ్యాపారితో సహా తమిళనాడుకు చెందిన పూజారులు హాజరుకానున్నారు. పార్లమెంట్-భవనం ప్రాంగణంలో ప్రార్థనా కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది అని కొత్త పార్లమెంట్ భవనం వర్గాలు చెబుతున్నాయి.