ప్రధాని మోదీ విద్యార్హతపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్
PM Modi Degree Case. ప్రధాని మోదీ విద్యార్హతపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్
By M.S.R Published on 1 April 2023 1:34 PM IST
PM Modi, Aravind Kejiriwal
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మళ్లీ స్పందించారు. గుజరాత్ కోర్టు తీర్పు ప్రజలకు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉందని, డిగ్రీ సర్టిఫికెట్ అడిగితే ఎందుకింత భయమని ప్రశ్నించారు. మోదీ డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవేమోననే అనుమానం కలుగుతోందని, ఈ అనుమానానికి కారణం కోర్టు తీర్పేనని అన్నారు. దీంతోపాటు మరెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు.
ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల వివరాల కోసం కేజ్రీవాల్ గతంలో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కి లేఖ రాశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం మోదీ విద్యార్హతల వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ప్రధాని మోదీ సర్టిఫికెట్ల అంశం ప్రజలకు సంబంధించిన విషయమా? అంటూ గుజరాత్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ పిటిషన్ వేసిన కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా విధించింది. మోదీ సర్టిఫికెట్లను చూపించాల్సిన అవసరం పీఎంవోకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీరేన్ వైష్ణవ్ తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. "ఇది ప్రజాస్వామ్యం. ఒక వ్యక్తి పదవి చేపడితే అతడు డాక్టరేట్ చేశాడా, లేక నిరక్షరాస్యుడా అనే తేడాలు ఉండరాదు. అయినా ఆ వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడం తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది?" అంటూ కోర్టు పేర్కొంది.