నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం థీమ్ 'డెవలప్డ్ స్టేట్ ఫర్ డెవలప్డ్ ఇండియా@2047'. ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధిలో వేగం పెంచాలన్నారు. కేంద్రం, రాష్ట్రాలు అన్నీ కలిసి టీం ఇండియాలా కలిసికట్టుగా పనిచేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదు. అభివృద్ధి చెందిన భారతదేశమే ప్రతి భారతీయుడి లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇది 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్ష అన్నారు.
భారత్‌లో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తులో నగరాల కోసం మనం పని చేయాలి. వృద్ధి, ఆవిష్కరణ, సుస్థిరత మన నగరాల వృద్ధి ఇంజిన్‌లుగా ఉండాలన్నారు. ప్రపంచ ప్రమాణాలతో సమానంగా రాష్ట్రాలు కనీసం ఒక పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలి. అక్కడ అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.. ఒక రాష్ట్రం - ఒక ప్రపంచ గమ్యం.. దీంతో పొరుగున ఉన్న నగరాలు కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు.