అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 24వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని మోడీ రిలీజ్ చేయనున్నారు. పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. 2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతోంది. పీఎం కిసాన్ నిధులను పొందేందుకు రైతులు తప్పనిసరిగా తమ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ-కేవైసీ పూర్తిచేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కాని అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అలాగే భూమి ధృవీకరణ కూడా అవసరమని, ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాతో లింక్ చేయించుకోవడం తప్పనిసరని సూచించారు.