బస్సుల్లో వెళుతున్నప్పుడు కాస్త ప్రశాంతత కోరుకుంటూ ఉంటాం.. కానీ కొందరు మాత్రం అదే పనిగా గట్టిగా అందరికీ వినిపించేలా పాటలు పెడుతూ ఉంటారు. ఇది కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వీలైతే ఇయర్ ఫోన్స్ వాడాలని సూచిస్తూ ఉంటారు.. అయితే కొందరు అసలు పట్టించుకోరు. ఇష్టమొచ్చినట్లు గట్టిగా పాటలు పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వారిని దింపేసే హక్కు బస్సు కండక్టర్ కు ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సుల్లో ప్రయాణించే వారు మొబైల్ స్పీకర్లలో పాటలు ప్లే చేయడాన్ని నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా కర్ణాటక హైకోర్టు ఇలా పాటలు పెట్టడాన్ని నిషేధం విధించాలని నిర్ణయించింది. బస్సుల లోపల శబ్దాలపై ఆంక్షలు విధించాలని పిటిషన్ కోరింది. అధిక సౌండ్ తో పాటలు మరియు వీడియోలను ప్లే చేయడానికి మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని పరిమితం చేయాలని పేర్కొంది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల ప్రకారం బస్సులోని అధికారులు అధిక సౌండ్ తో పాటలు ప్లే చేయవద్దని మరియు సహ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని ప్రయాణీకులను కోరాలని పేర్కొంది. అలాంటి సూచనలు ప్రయాణికుడు వినకపోతే, అధికారులు లేదా బస్సు కండక్టర్ ప్రయాణీకుడిని బస్సు నుండి దింపేయవచ్చని హైకోర్టు తెలిపింది.