ఓ వైపు ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంచేశారు.. మరో వైపు సరికొత్త నిబంధనలు

Platform Ticket Price Hike. ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను రూ. 30 నుంచి 50 రూపాయలకు పెంచేసింది దక్షిణ మధ్య రైల్

By Medi Samrat  Published on  13 April 2021 2:00 PM GMT
ఓ వైపు ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంచేశారు.. మరో వైపు సరికొత్త నిబంధనలు

ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను రూ. 30 నుంచి 50 రూపాయలకు పెంచేసింది దక్షిణ మధ్య రైల్వే. రైలెక్కే వారు తప్ప మిగతా వారెవరూ స్టేషన్ కు రాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు. పెంచిన చార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సికింద్రాబాద్ స్టేషన్ కు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని, మిగిలిన రైల్వే స్టేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాన్నీ ఇంకా తీసుకోలేదని అన్నారు.

రైళ్లలో కరోనా మహమ్మారి ప్రబలకుండా ఆపేందుకు సరికొత్త నిబంధనలను తీసుకుని వచ్చింది భారతీయ రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ ప్రతి రోజూ 1,402 స్పెషల్ ట్రైన్స్ ని నడుపుతోంది. 5,381 సబర్బన్ రైళ్లు, 830 పాసింజర్ రైళ్లు ప్రతిరోజు నడుస్తున్నాయి. రైళ్లలో ప్రయాణించే వారికి కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ అవసరం లేదని తేల్చింది. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన కరోనా నిబంధనలను మాత్రం ప్రతి ప్రయాణికుడు తప్పకుండా పాటించాలి.

కరోనా నేపథ్యంలో పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు... రైళ్లలో ఆహారాన్ని వండే ప్రక్రియను రద్దు చేశారు. అయితే తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని సరఫరా చేస్తారు. రైల్వే స్టేషన్లలోని మల్టీ పర్పస్ స్టాళ్లలో మాస్కులు, శానిటైజర్స్, గ్లోవ్స్, బెడ్ రోల్ కిట్స్ అందుబాటులో ఉంటాయి. స్టేషన్లలోనే ప్రయాణికులు వీటిని కొనుగోలు చేయవచ్చు. రైలు సర్వీసులను రద్దు చేసే ఆలోచన ఇప్పటికిప్పుడే రైల్వే బోర్డుకు లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికులకు అవసరమైన సంఖ్యలో రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే అదనపు సర్వీసులను నడిపేందుకు కూడా సిద్ధమేనని అధికారులు తెలిపారు.
Next Story
Share it