ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటీషన్

Petition Filed In Supreme Court Regarding Odisha Train Accident. ఒడిశా రైలు ప్రమాదం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కేసు దర్యాప్తునకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలైంది.

By Medi Samrat  Published on  4 Jun 2023 9:30 AM GMT
ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటీషన్

ఒడిశా రైలు ప్రమాదం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కేసు దర్యాప్తునకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలాసోర్ రైలు ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం తక్షణమే అమలులోకి వచ్చేలా భారతీయ రైల్వేలో ఆటోమేటిక్ రైలు రక్షణ (ATP) వ్యవస్థ (కవాచ్ సురక్షా సిస్టమ్ అని పిలుస్తారు) అమలు కోసం మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం నాడు బాలాసోర్ సమీపంలోని బహంగా బజార్ వద్ద రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాల‌కు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం అందిస్తామన్నారు. మృతులపై ఆధారపడిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, ప్రమాదంలో గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) తెలిపింది. అంతకుముందు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ద్వారా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

రైల్వే ప్రాథమిక నివేదిక ప్రకారం.. బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలోని కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌లోకి కాకుండా లూప్ లైన్‌లోకి ప్రవేశించిన తర్వాత ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. రైల్వే చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి. ప్ర‌మాదంలో 288 మంది ప్రయాణికులు మరణించగా, 1,100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాద స్థలంలో జరుగుతున్న మరమ్మతు పనులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వరుసగా రెండవ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. దీనిపై రైల్వే సేఫ్టీ కమిషనర్‌ విచారణ జరిపారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. దీనికి బాధ్యులైన వ్యక్తులను కూడా గుర్తించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు రావడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి వెల్లడించారు.


Next Story