'ఉచిత ప‌థ‌కాల‌ వల్ల ప్రజలు పని చేసేందుకు సిద్ధంగా లేరు'.. 'డబ్బు పంపిణీపై సుప్రీంకోర్టు ఆగ్రహం'

ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు ఖండించింది.

By Medi Samrat  Published on  12 Feb 2025 2:40 PM IST
ఉచిత ప‌థ‌కాల‌ వల్ల ప్రజలు పని చేసేందుకు సిద్ధంగా లేరు.. డబ్బు పంపిణీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు ఖండించింది. ఉచిత రేషన్, డబ్బు పంపిణీ వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడరని పేర్కొంది. రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలన్న డిమాండ్‌పై కోర్టులో విచారణ కొనసాగుతోంది.

'దురదృష్టవశాత్తూ, ఈ ఉచిత సౌకర్యాల వల్ల.. ప్రజలు పని చేసేందుకు ఇష్టపడడం లేదు. వారికి ఉచితంగా రేషన్‌ అందుతోంది. ఏ పనీ చేయకుండానే డబ్బులు దండుకుంటున్నారు అని జస్టిస్ గవాయ్ అన్నారు. వారి పట్ల మీకున్న శ్రద్ధను మేము అభినందిస్తున్నాము, అయితే ఈ వ్యక్తులను సమాజంలోని ప్రధాన స్రవంతిలో చేర్చి, దేశ అభివృద్ధికి సహకరించే అవకాశం వారికి లభిస్తే మంచిది కాదా అని ధర్మాసనం పేర్కొంది.

పట్టణ పేదరిక మిషన్‌ను ఖరారు చేసే ప్రక్రియలో కేంద్రం ఉందని, పట్టణ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతోపాటు పలు సమస్యలను పరిష్కరిస్తామని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను ఎప్పటిలోగా అమలు చేస్తారో కేంద్రం స్పష్టం చేయాలని అటార్నీ జనరల్‌ను ధర్మాసనం కోరింది. అనంతరం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు వాయిదా వేసింది.

దీనికి ముందు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు పెద్ద వ్యాఖ్య చేసింది. రాష్ట్రాలు ఇస్తున్న ఫ్రీ ప‌థ‌కాల‌పై కోర్టు ఒక ప్రకటన ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉచిత పథకాలకు డబ్బు ఉందని, అయితే న్యాయమూర్తుల జీతం, పెన్షన్‌కు డబ్బు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

అంతకుముందు.. గత ఏడాది అక్టోబర్‌లో కూడా సుప్రీంకోర్టు ఒక కేసులో ఉచితాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు నోటీసు జారీ చేసి వారి ప్రతిస్పందనను కోరింది. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పిటిషన్‌ వేశారు. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు చేయకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు.

Next Story