పెగాసస్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్
Pegasus spyware issue PIL in Supreme Court seeks SIT probe. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెగాసస్ స్పై వేర్ గురించే చర్చ జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 22 July 2021 9:08 AM GMTదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెగాసస్ స్పై వేర్ గురించే చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు చేరింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న శశిథరూర్ ఈ వ్యవహారంపై చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈనెల 28వ తేదీన స్టాండింగ్ కమిటీ పౌరుల భద్రత, గోప్యతపై చర్చించనుంది. ఈ మేరకు ఐటీ, సమాచార, హోంశాఖకు కమిటీ సమన్లు జారీ చేయనుంది. దేశంలో పౌరుల భద్రత, గోప్యతకు భంగం కలిగించేలా కేంద్రం చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయించాలని కోరింది. పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని వివరించింది. అడ్వకేట్ ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, పెగాసస్ కుంభకోణం చాలా తీవ్రమైనదని చెప్పారు. భారత దేశ ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, దేశ భద్రతలపై తీవ్రమైన దాడి అని తెలిపారు. నిఘాను విస్తృతంగా, యథేచ్ఛగా, జవాబుదారీతనం లేకుండా ఉపయోగించడం నైతికంగా వికృతమని.. వ్యక్తిగత గోప్యత అంటే దాచిపెట్టాలనే కోరికకు సంబంధించినది కాదని, ఒకరి సొంతానికి ఉండే వ్యక్తిగత పరిధికి సంబంధించినదని అన్నారు.
పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం కేవలం ఓ వ్యక్తి సంభాషణలను చాటుగా వినడం మాత్రమే కాదని, ఆ వ్యక్తి యావత్తు జీవితానికి సంబంధించిన డిజిటల్ ఇంప్రింట్‌ను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చునని తెలిపారు. ఫోన్ యజమానిని మాత్రమే కాకుండా ఆ వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉండేవారందరి గురించి తెలుసుకోవడానికి దారి తీస్తుందని వివరించారు. ఎన్ఎస్ఓ గ్రూప్ కంపెనీ క్లయింట్లు దాదాపు 50 వేల ఫోన్ నంబర్లను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని ఈ పిటిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. పెగాసస్ అనేది కేవలం నిఘా సాధనం మాత్రమే కాదని, ఇది సైబర్ ఆయుధమని, దీనిని భారత ప్రభుత్వ వ్యవస్థపై ప్రయోగిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఈ పిటిషన్ కోరింది. ఈ కుంభకోణంలో నిందితులందరినీ శిక్షించాలని కోరింది.