మహారాష్ట్ర ప్రజలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న లాతూర్, భోకర్ తదితర పట్టణాల్లో పవన్ మహాయుతి కూటమి తరఫున ప్రచారం చేశారు. ఆయన ర్యాలీలు, సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. తమ అభిమాన హీరో, నాయకుడిని చూసేందుకు యువకులు, మహిళలు పోటీ పడ్డారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఎందరో మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడారని, వారి ఆశయాలకు దెబ్బతీస్తున్న అసాంఘిక శక్తులను తరిమికొట్టి, దేశ సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కోరారు. శనివారం నాడు నాందేడ్ జిల్లా పాలజ్, దెగ్లూరు బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. తాను కేవలం ఓట్లు అడగడానికి ఇక్కడికి రాలేదన్నారు.
ఈ గడ్డ మహనీయులు, సాధు సంతువులు నడిచిన నేల అని, మాతా జిజియాబాయ్, ఛత్రపతి శివాజీల జన్మస్థలమని పవన్ అన్నారు. ఈ గడ్డపై తన ఇష్టాన్ని, గౌరవాన్ని తెలిపి, మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చానని అన్నారు. సనాతన ధర్మం, మరాఠా భాషా సంస్కృతుల పరిరక్షణకు పోరాడదాం అని పవన్ పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలని పవన్ అన్నారు. 2028లోపు మహారాష్ట్రను రూ.లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతోందని పవన్ తెలిపారు. తాను ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిక్కచ్చిగా ఉండటం, అధికారంతో సంబంధం లేకుండా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, అన్యాయాల, అక్రమాలను ప్రశ్నించడంలో బాల్ ఠాక్రే నుంచి స్ఫూర్తి పొందాను అని పవన్ పేర్కొన్నారు.