సాధారణంగా ఆన్‌లైన్‌లో ఏదైనా ప్రొడక్ట్‌తో కోసం ఆర్డర్ చేసినప్పుడు.. ఒక దానికి బదులుగా మరో వస్తువు రావడం మనం చాలా సందర్భాల్లోనే చూసి ఉంటాం. అయితే ఇక్కడ ఆర్డర్ చేసిన ప్రొడక్ట్‌తో పాటు దానితో సంబంధం ఉన్న మరొకటి కూడా వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లా కనియంబెట్ట విలేజ్‌కి చెందిన మితున్ బాబు ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో పాస్‌పోర్ట్ కవర్ కోసం ఆర్డర్ చేశాడు. అయితే అతనికి పాస్‌పోర్టు కవర్‌తో పాటు ఒరిజినల్ పాస్‌పోర్టును కూడా డెలివరీ చేశారు. మితున్ బాబుకు నవంబర్ 1వ తేదీన ప్రొడక్ట్ అందింది. దానిని ఓపెన్ చేసి చూడగా.. అందులో పాస్‌పోర్టు కవర్‌తో పాటు.. ఒరిజినల్ పాస్‌పోర్టు కూడా వచ్చింది. ఇదే విషయమై మితున్ అమెజాన్ కస్టమర్ కేర్ కాల్ చేశాడు. జరిగిన విషయాన్ని చెప్పాడు. అయితే అమెజాన్ కస్టమర్ చెప్పిన సమాధానం విన్న మితున్ విస్మయానికి గురి అయ్యాడు.
మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని, సెల్లర్లకు జాగ్రత్తగా ఉండాలని చెబుతామని చెప్పారు. అయితే డెలివరీ అయిన పార్శిల్‌లో వచ్చిన ఒరిజినల్ పాస్‌పోర్టు సంగతి గురించి మాత్రం ఏం చెప్పలేదు. మితున్ దగ్గర ఉన్న పాస్ట్‌పోర్ట్ త్రిస్సూర్ జిల్లాకు చెందిన మహ్మద్ సాలిహ్ అనే వ్యక్తిది. అయితే అతనికి ఫోన్ చేసి చెప్పుదామంటే పాస్‌పోర్ట్‌పై ఫోన్ నంబర్ లేదు.. దీంతో విశ్వ ప్రయత్నాలు చేసి మహ్మద్ సలీహ్ జాడ కనిపెట్టాడు మితున్ బాబు. చివరికి అతని పాస్‌పోర్ట్ అతనికి పంపించాడు. ముందుగానే మహ్మద్ సలీహ్ పాస్‌పోర్టు కవర్ కోసం మహ్మద్ సలీహ్ ఆర్డర్ చేసి ఉంటాడని మితున్ బాబు ఊహించాడు. ఆ ఆర్డర్ రాగానే అందులో పాస్‌పోర్టు పెట్టి, అది నచ్చకపోవడంతో రిటర్న్ చేసే సమయంలో పాస్‌పోర్ట్ తీయడం మర్చిపోయి ఉంటాడని మితున్ అంచనా వేశాడు. ఈ క్రమంలోనే పాస్‌పోర్టు తనదాకా వచ్చి ఉంటుందన్నాడు.