సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది వేగంగా స్పందించడంతో ఢిల్లీలోని IGI విమానాశ్రయంలో గుండెపోటుకు గురైన ఒక ప్రయాణికుడి ప్రాణాలు కాపాడగలిగారు. మంగళవారం ఉదయం టెర్మినల్ 2 నుంచి శ్రీనగర్ వెళ్లే విమానం ఎక్కేందుకు సిద్ధమైన అర్షిద్ అయూబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. CISF కు చెందిన క్విక్ రియాక్షన్ టీమ్ వెంటనే CPR చేసి, అతని ప్రాణాన్ని కాపాడింది. అయూబ్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన వీడియోలో అయూబ్ ఎయిర్‌పోర్టులో కుప్పకూలినట్లు తెలుస్తోంది. CISF కు చెందిన ఇద్దరు సభ్యుల క్విక్ రియాక్షన్ టీమ్ (QRT), కూలిపోవడాన్ని చూసిన వెంటనే, ఒక సభ్యుడు అతనికి CPR చేయడం మొదలు పెడతారు. బాధితుడు కోలుకుంటాడు. "సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తత, సత్వర చర్య కారణంగా ఒక విలువైన ప్రాణం కాపాడగలిగాం" అని అధికారి తెలిపారు.