భారీ వరదలు.. నీట మునిగిన పశుపతినాథ్‌ టెంపుల్‌

Pashupatinath temple submerged due to heavy rains. మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే

By అంజి  Published on  23 Aug 2022 4:40 AM GMT
భారీ వరదలు.. నీట మునిగిన పశుపతినాథ్‌ టెంపుల్‌

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రముఖ పశుపతినాథ్‌ ఆలయం నీట మునిగింది. మందసౌర్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శివనా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీగా వరద రావడంతో పశుపతినాథ్‌లోని గర్భగుడిలో వరద నీరు వచ్చింది. దీంతో అష్టముఖి విగ్రహం కింది భాగంలోని నాలుగు ముఖాలు పూర్తిగా నీటమునిగాయి. పశుపతినాథుడి ఆలయంలోకి నీరు రావడం.. గతవారం రోజుల్లో రెండోసారి.

మరో వైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. బీహార్ రాజధాని పాట్నాలో ఘాట్‌లు నీట మునిగాయి. నివాస ప్రాంతాల్లోకి నీరు చేరడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ల మధ్య రోడ్డు మార్గం తెగిపోయింది. గత 24 గంటలుగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చంబల్, కలిసింద్, పార్వతి, ఉజాద్, అహు సహా రాజస్థాన్‌లోని అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. చంబల్ తన భీకర రూపాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో మధ్యప్రదేశ్‌తో రాజస్థాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాల కారణంగా కోటలోని 12కి పైగా కాలనీలు జలమయమయ్యాయి.


Next Story