పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో బుధవారం నాడు హిందీ చిత్రం 'ఛావా' ప్రత్యేక ప్రదర్శనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ ప్రదర్శనకు క్యాబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు హాజరవుతారు. ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. మరాఠా పాలకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితాన్ని ఈ చిత్రంలో చూపించారు. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగే ఛావా ప్రదర్శనలో శంభాజీ మహారాజ్ పాత్రను పోషించిన నటుడు విక్కీ కౌశల్‌తో సహా సినిమా తారాగణం, సిబ్బంది అందరూ పాల్గొంటారు.
గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ ఛావా చిత్రం ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోరాడడంలో శంభాజీ మహారాజ్ ధైర్యాన్ని ఇందులో చిత్రీకరించారని ప్రధాని మోదీ అన్నారు. శివాజీ సావంత్ మరాఠీ నవల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్ర కథ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుందని ఆయన అన్నారు.