8 నుంచి రెండో విడత పార్లమెంట్‌ సమావేశాలు

Parliament Session Starts From 8th March. పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

By Medi Samrat  Published on  7 March 2021 8:45 PM IST
8 నుంచి రెండో విడత పార్లమెంట్‌ సమావేశాలు

పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల మధ్య సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. రెండో వడత బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 8వ తేదీ వరకు కొనసాగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.

పార్లమెంట్‌ తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ ప్రసంగం తర్వాత ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాష్ట్రపతికి ధన్యవాదాల తీర్మానా, బడ్జెట్‌పై సాధారణ చర్చ నిర్వహించారు. బడ్జెట్‌తో పాటు కొత్త సాగు చట్టాలపైనా సభలో చర్చ జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేశాయి. తదుపరి సమావేశాలు మార్చి8కి వాయిదా పడ్డాయి.

కాగా, మొదటి విడతలో మొత్తం 49 గంటల 17 నిమిషాల పాటు చర్చ జరిగిందని లోక్‌సభ కార్యాలయం వెల్లడించింది.ఇందులో అత్యధికంగా 16 గంటల 39 నిమిషాలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికే సరిపోయాయి. మరో 10 గంటల సమయం పాటు బడ్జెట్‌పై చర్చ జరిగింది. మొత్తం 117 మంది సభ్యులు బడ్జెట్ చర్చలో పాల్గొన్నారు.

కీలక ఆమోదాలు:

కాగా, ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌, కేరళ, అసోం, తమిళనాడుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్‌ కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశముంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో రైతుల ఆందోనలు 100 రోజులు పూర్తిచేసుకున్నాయి. ఈ సమావేశాల్లో మరోసారి వ్యవసాయ చట్టాలపై విపక్షాలు ఆందోళన చేసే అవకాశముంది.


Next Story