సాగు చట్టాల రద్దుకు పార్లమెంట్ లో ఆమోదం
Parliament passes bill to repeal three farm laws. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ
By Medi Samrat Published on 29 Nov 2021 3:29 PM ISTమూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ నిర్వహించకుండానే సాగు చట్టాలను రద్దు చేసినట్లు విపక్షాలు ఆరోపించాయి. దీంతో సభలో రభస మొదలైంది. మూడు సాగు చట్టాల రద్దు బిల్లును ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియలో భాగంగా ఐదు రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆ చట్టాల రద్దుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ డిమాండ్ చేశారు. చర్చ లేకుండా మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయడంతో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. మూజువాణి ఓటుతోనే బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లును లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదమే మిగిలింది. సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఓ సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబరు 19న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు.