పార్లమెంట్ వాయిదా..!
Parliament Monsoon Session Live Updates. పెగాసస్, ఇతర సమస్యలపై పార్లమెంట్ ఉభయసభల్లో మూడవ రోజు కూడా హైడ్రామా
By Medi Samrat Published on 22 July 2021 5:08 PM ISTపెగాసస్, ఇతర సమస్యలపై పార్లమెంట్ ఉభయసభల్లో మూడవ రోజు కూడా హైడ్రామా నడిచింది. విపక్ష సభ్యులు ఎంత వరకూ వెనక్కు తగ్గకపోవడంతో పార్లమెంట్ ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో పార్లమెంటు ఉభయ సభలను శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష టిఎంసి ఎంపిలు కాగితాలను చించి గాలిలోకి విసిరేశారు. ప్రతిపక్ష ఎంపీలు కొత్తగా అమలు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్, మీడియా సంస్థలపై ఐటి సోదాలపై విపక్ష ఎంపిలు ఆందోళనలు చేపట్టారు.
రాజ్యసభలో గురువారం విపక్ష సభ్యుల విమర్శలతో ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ తన ప్రకటనను వినిపించలేకపోయారు. పెగాసస్ గురించి మాట్లాడేందుకు వైష్ణవ్ లేవగానే తృణమూల ఎంపి శాంతన్ సేన్ పత్రాలను లాక్కొని, చించేసి, డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ వైపు విసిరారు. ఈ కథనం చుట్టూ చాలా ఆరోపణలు ఉన్నాయని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు.. ఇదేమీ యాదృచ్చికం కాదంటూ అశ్విని ముగించారు. దీంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.విపక్షాల ఆందోళనలతో గురువారం రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది.
లోక్‌సభ కూడా మూడు సార్లు వాయిదా పడింది. పెగాసస్‌తో పాటు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిసస్తూ మమతా ఎంపిలతో పాటు అకాలీదళ్ ఎంపిలు ఆందోళనలకు దిగారు. వీటికి ప్రధాని మోడీ సమాధానాలనివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలు కొనసాగుతుండగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఏ అంశంపైనైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఎంత సేపటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్ సభను కూడా వాయిదా వేశారు.