పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రం కీలక నిర్ణయం
Parliament Monsoon Session 2020. పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 15 Dec 2020 12:13 PM GMT
పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో శీతాకాల సమావేశాలను నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. సమావేశాల నిర్వహణకు సంబంధించి అన్ని పార్టీల నేతలతో కేంద్రం చర్చలు జరపగా.. ఈ సమావేశంలో సభ్యులందరూ ఏకాభిప్రాయాన్ని తెలియజేయడంతో సమావేశాలను రద్దు చేస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జనవరిలో నేరుగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నట్లు సమాచారం.
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్‌లో చర్చించాలని కాంగ్రెస్ లోక్‌సభ నేత అధిర్ రంజన్ చౌధరీ డిమాండ్ చేసిన నేపథ్యంలో జోషి లేఖ ద్వారా నిర్ణయాన్ని తెలియజేశారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తును ప్రారంభించిందన్నారు.
సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్‌లో జరుగుతాయి. బడ్జెట్ సమావేశాలు జనవరి చివరి వారంలో ప్రారంభమవుతాయి. రాజ్యాంగం ప్రకారం రెండు సమావేశాల మధ్య కాలం 6 నెలలు దాటకూడదు. ఆ ప్రకారమే జనవరిలో బడ్జెట్ సమావేశాలు జరపబోతున్నారని తెలిసింది.