కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్‌ షా

Parliament Live Updates. కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని

By Medi Samrat  Published on  13 Feb 2021 11:40 AM GMT
కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్‌ షా

కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందో చెప్పాలని, కాంగ్రెస్‌ సక్రమంగా పాలించి ఉంటే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని నివేదిక కోరే అవసరం ఉండేది కాదన్నారు. శనివారం జమ్మూ-కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, 2021ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి అడిగిన ప్రశ్నకు అమిత్‌షా సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇచ్చే భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత ప్రజలకు కేంద్రం ఇచ్చిన వాగ్దానాల అమలు గురించి తెలుపాలని కోరారు. జమ్మూకశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే.

అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రశ్నపై అమిత్‌ షా స్పందిస్తూ.. అధికరణ 370ని రద్దు చేస్తూ తాము ఇచ్చిన హామీల అమలు గురించి తమను అడిగారని, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇస్తున్న ఈ అధికరణను రద్దు చేసి 17 నెలలు అవుతోందని అన్నారు. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేసిందేమిటోనని ఆ పార్టీ వివరించిందా..? అని అడిగారు. మీరు 70 ఏళ్లలో చేసిన పనులను వివరిస్తూ నివేదికను విడుదల చేశారా.. మీరు సరిగ్గా పని చేశారా..? అని ప్రశ్నించారు. మీరు సరిగ్గా పని చేసి ఉంటే మీరు మమ్మల్ని అడగాల్సిన అవసం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.

ప్రతి విషయంపై వివరణ, నివేదికలను సమర్పించేందుకు తాను సిద్దమేనని, అందుకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు.అయితే తరతరాలు పాలించే అవకాశం పొందిన వారు తమను తామము పరిశీలించుకోవాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కశ్మీర్‌ లోయలో వేలాది మంది హత్యకు గురయ్యారని, అనేక రోజుల పాటు కర్ఫ్యూ విధించేవారని గుర్తు చేశారు. కశ్మీర్‌లో ప్రశాంతత చాలా గొప్ప విషయమని అన్నారు.అల్లకల్లోలం ఉన్న రోజులను తాను గుర్తు చేసుకోవాలనుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఉందని, అలాంటి కల్లోల పరిస్థితులు పునరావృతం కాబోవని అమిత్‌షా పేర్కొన్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, మిజోరాం, కేంద్ర పాలిత ప్రాంతాల సివిల్‌ సర్వీసెస్‌ కేడర్‌లో జమ్మూ కశ్మీర్‌ కేడర్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో జమ్మూకశ్మీరు పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, 2021ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.




Next Story