నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ శుక్రవారం నియమితులయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆయన నియామకాన్ని ప్రకటించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జూన్ 30, 2022న ప్రస్తుత CEO అమితాబ్ కాంత్ పదవీకాలం పూర్తయిన తర్వాత అయ్యర్ పదవీకాలం ప్రారంభమవుతుంది. అమితాబ్ కాంత్‌కు వర్తించే నిబంధనల ప్రకారం అయ్యర్ నియామకం జరిగిందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆర్డర్ పేర్కొంది.
పరమేశ్వరన్ అయ్యర్.. ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1981-బ్యాచ్ IAS అధికారి. సుప్రసిద్ధ పారిశుధ్య నిపుణుడు. గత ఏడాది జూలైలో తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. అయ్యర్ 2009లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆయన ఐక్యరాజ్యసమితిలో సీనియర్ గ్రామీణ నీటి శానిటేషన్ స్పెషలిస్ట్‌గా కూడా పనిచేశారు.