కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పీయూ, డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా కాలేజీలు, యూనివర్సిటీలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (డీసీటీఈ) పరిధిలోని కాలేజీలకు ప్రకటించిన సెలవును పొడిగించింది. ఫిబ్రవరి 16 వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సంస్థలను ఆదేశించింది. ఇటీవలే మూడు రోజుల పాటు కర్ణాటకలోని అన్ని ఉన్నత పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫిబ్రవరి 8న ఆదేశించారు. హిజాబ్ వివాదం నియంత్రణలో లేకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండటంతో, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ పరిధిలోని కళాశాలలకు సెలవును పొడిగించాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో ఫిబ్రవరి 16, బుధవారం వరకు విద్యా సంస్థలు మూసివేయనున్నారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్లో అశాంతి రాజేందుకు సిద్ధమైందని ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక అంచనాకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ఖలీస్థానీ విభాగం 'సిఖ్స్ ఫర్ జస్టిస్' (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) హెచ్చరించాయి. అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖలకు నిఘా వర్గాలు హెచ్చరించాయి.