భారత్ లో భారీ ఉగ్ర దాడికి కుట్రలు

Pakistan’s ISI planning big terror strike in India during festive season. భారత్ లో ఉగ్రదాడికి పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ప్రణాళికలు రచిస్తోందని భారత్ కు చెందిన

By M.S.R  Published on  23 Sep 2021 11:41 AM GMT
భారత్ లో భారీ ఉగ్ర దాడికి కుట్రలు

భారత్ లో ఉగ్రదాడికి పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ప్రణాళికలు రచిస్తోందని భారత్ కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఐఈడీని టిఫిన్ బాక్స్‌లో పెట్టి ఈ పేలుడు జ‌ర‌పాల‌ని కుట్ర ప‌న్నిన‌ట్లు తేలింది. భారతదేశంలో పండుగ‌ల సీజ‌న్ లో ర‌ద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు జ‌ర‌ప‌డానికి ఐఎస్ఐ ప్ర‌ణాళిక ర‌చించింద‌ని నిఘా వ‌ర్గాలు తెలిపాయి. ఇదే స‌మ‌యంలో ఉగ్ర‌వాదులు కూడా దేశంలోకి చొర‌బ‌డే ప్ర‌మాదం ఉన్న‌ట్లు హెచ్చ‌రించాయి.

ఈ ప్లాన్ అమ‌లు చేయ‌డానికి ఇప్ప‌టికే మ‌నుషులు, అవ‌స‌ర‌మైన ఆర్థిక వ‌న‌రులు, వ‌స్తువుల‌ను సిద్ధం చేసిన‌ట్లు ఇంటెలిజెన్స్ వెల్ల‌డించింది. పాక్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ న‌వ‌రాత్రి, రామ్‌లీలా సంద‌ర్భంగా పేలుడు కోసం ర‌చించిన ప్ర‌ణాళిక‌ను ఢిల్లీ పోలీసుల ప్ర‌త్యేక విభాగం భ‌గ్నం చేసింది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సెప్టెంబర్ 14 న వివిధ రాష్ట్రాల్లో పలు దాడులు చేయడం ద్వారా ఇద్దరు పాకిస్తాన్-ఐఎస్ఐ శిక్షణ పొందిన ఉగ్రవాదులతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆరుగురు నిందితులను జాన్ మహ్మద్ షేక్ అలియాస్ 'సమీర్', ఒసామా, మూల్‌చంద్, జీషన్ ఖమర్, మొహమ్మద్ అబూ బకర్ మరియు మొహమ్మద్ అమీర్ జావేద్‌గా గుర్తించారు. ఒసామా, ఖమర్‌ లు పాకిస్తాన్‌ ఐఎస్ఐ ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. AK-47 తో సహా పేలుడు పదార్థాలు, తుపాకీలను ఉపయోగించడానికి శిక్షణ తీసుకుని ఇప్పుడు భారత్ లో ఉంటున్నారు. వారిని అధికారులు అరెస్టు చేయడంతో పెద్ద ముప్పు తప్పింది.


Next Story
Share it